ప్రకృతి సాగుతో పండించిన కూరగాయల అమ్మకానికి రైతుబజార్లలో ప్రత్యేక షాపులు కేటాయించాలి


నిత్యావసర సరుకులు ధరలు పెరగకుండా పర్యవేక్షణ చేయాలి
జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం లో అధికారులతో సమీక్షించిన జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ

 
ఏలూరు, డిసెంబర్ 9: ప్రకృతి సాగు ద్వారా పండించిన కూరగాయలు అమ్మకానికి ప్రతీ రైతు బజార్లోనూ రెండు షాపులు కేటాయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం జరిగిన జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 

ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో కూరగాయలు, నిత్యావసర సరుకులు ధరలు పెరగకుండా నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల వినియోగం ద్వారా అనారోగ్యం పాలవుతారని, ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రకృతి సాగు ద్వారా పండించిన కూరగాయలను ప్రతీ రైతుబజార్లలో అమ్మెందుకు ప్రత్యేకంగా రెండు షాపులు కేటాయించాలన్నారు.

ఆహార పదార్థాలు, కూరగాయలకు ఆకర్షణీయత కోసం కృత్రిమ రంగులు వేసి అమ్ముతుంటారని, ఉదాహరణకు బఠాణి కి ఆకుపక్ష రంగు  చేర్చడంతో కేన్సర్ వంటి అనారోగ్య పాలతారన్నారు. ఎటువంటి పనులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ జేసీ అధికారులను ఆదేశించారు. వ్యాపారాలు నిత్యావసర సరుకులను అక్రమంగా నిల్వలు చేసి, బహిరంగ మార్కెట్లో  కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచే అవకాశం ఉన్నందున, నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలపై ఎప్పటికప్పుడు  నిఘా పెట్టాలన్నారు. 

వ్యాపారులు పెద్దఎత్తున అక్రమ నిల్వలకు పాల్పడితే, గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు ధరలు మార్కెటింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, అలా కాకుండా నిత్యావసర వస్తువులలో ఏ వస్తువు ధరైనా అసాధారణ రీతికి చేరుకుంటే, అందుకు గల కారణాలను తెలుసుకుని, వెంటనే ఆ వస్తువులను పెద్దమొత్తంలో మార్కెట్లో అందుబాటులో ఉంచి ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  

రైతుబజార్లలో  నిర్దేశించిన రేట్ల కంటే అధిక ధరకు వస్తువులు అమ్మకుండా చర్యలుతీసుకోవాలని,  త్రాగునీరు, టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవన శాఖ డిడి షాజా నాయక్, మార్కెటింగ్ శాఖ ఏడి శ్రీనివాస్, జిల్లాలోని రైతుబజార్ల  ఎస్టేట్ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.