పాత బకాయిలు చెల్లించకుండా కొత్త కాంట్రాక్టు ఎలా?: వైద్య ఆరోగ్యశాఖ అధికారులను నిలదీసిన ఏఐటియుసి


చింతలపూడి పశ్చిమ (వాహిని ప్రతినిధి): ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పాత బకాయిలు చెల్లించకుండా కొత్త కాంట్రాక్టును ఎలా నియమించారని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు తొర్లపాటి బాబు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు.


జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల జీతాలు, 12 నెలల పీఎఫ్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. పాత కాంట్రాక్టర్ భాగస్వాములు పరస్పరం కేసులు వేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, వారి గొడవల మధ్య కార్మికుల బతుకులు ఎవరు పట్టించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో పాత కాంట్రాక్టును రద్దు చేసి, జనవరి 26 నుంచి నూతన కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించడం అన్యాయమన్నారు. ఆసుపత్రిలో పనుల స్థాయి, అవసరమైన కార్మికుల సంఖ్య, జీతాల విధివిధానాలు ముందుగా తెలియజేయకుండా కాంట్రాక్టును ఎలా అప్పగించారని నిలదీశారు.

ప్రస్తుత కాంట్రాక్టర్ “మాకు పాత బకాయిల విషయం తెలియదు, మేము బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సకాలంలో జీతాలు చెల్లిస్తాం” అని చెప్పడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మరి మా మూడు నెలల జీతాలు, పీఎఫ్ బకాయిల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించారు.

తక్షణమే జీతాలు, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, లేకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని కార్మికులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు.

ఈ సందర్భంగా చింతలపూడిలో నిర్వహించిన సమ్మెలో ది మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) చింతలపూడి శాఖ అధ్యక్షురాలు తొర్లపాటి మరియమ్మ, నాగరాజు, రాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు.