ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు బార్ అసోసియేషన్ నుంచి ఒక మహిళా న్యాయవాది జిల్లా అదనపు న్యాయమూర్తిగా ఎంపికవటం తొలిసారి అని ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామ్ పేర్కొన్నారు. ఇది ఒక చరిత్రగా మిగులుతుందన్నారు. జిల్లా అదనపు న్యాయమూర్తిగా ఎంపికైన గుంటూరు దుర్గాపూర్ణిమ ను ఏలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కోనే సీతారామ్ మాట్లాడుతూ ఈ స్ఫూర్తిని మిగతా న్యాయవాదులు కూడా తీసుకుని ఏలూరు బార్ అసోసియేషన్ నుంచి ఇంకా చాలామంది న్యాయమూర్తులుగా ఎంపిక అవ్వాలని కోరారు. ఉపాధ్యక్షులు కృష్ణారావు మాట్లాడుతూ ఎంతో శ్రమిస్తే గాని అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఎంపికవరని పేర్కొన్నారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నోముల రాముడు మాట్లాడుతూ విధి నిర్వహణలో న్యాయవాదుల కష్టాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఎంపికైన గుంటూరు దుర్గాపూర్ణిమ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల శ్రమకు ఇది ఫలితం అని పేర్కొన్నారు. కష్టపడితే ఫలితం తప్పక వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఏలూరు బార్ అసోసియేషన్ కార్యవర్గం, న్యాయవాదులు ఘనంగా ఆమె ను సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణ, ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ కార్యవర్గ కార్యవర్గ సభ్యులు కిషోర్, విజయ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.















Social Plugin