ఏలూరు జిల్లా, బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా, పోలవరం సబ్‌డివిజన్ పరిధిలోని బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. మృతదేహానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష–పరోక్ష సాక్ష్యాలను సమీకరిస్తూ వేగవంతమైన దర్యాప్తుతో నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు విజయం సాధించారు.
బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో Cr.No.132/2025, U/s 103(1) BNS కింద ఈ హత్య కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాల మేరకు, పోలవరం డివిజన్ డీఎస్పీ పర్యవేక్షణలో, జీలుగుమిల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. బుట్టాయగూడెం పోలీస్ సిబ్బంది సమన్వయంతో కేసును త్వరితగతిన ఛేదించారు.
కేసు వివరాలు.. బుట్టాయగూడెం మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో లోతైన దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం గురించి ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా, సాంకేతిక సమాచారం, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, సాక్ష్యాల సేకరణ ద్వారా నిందితుడిని గుర్తించారు.
మృతురాలి వివరాలు.. మృతురాలిగా పామర్తి శిల్పారాణి(25)గా గుర్తించారు. ఆమె భర్త వెంకటేశ్వరరావు మరణించారు. గౌడ కులానికి చెందిన ఆమె తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, పోతవరం గ్రామానికి చెందినవారు. స్వగ్రామం కొయ్యలగూడెం మండలం, సారిపల్లి గ్రామం కాగా, ఇటీవల జంగారెడ్డిగూడెం పట్టణంలోని హరిజనపేట, పాత బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు.
నిందితుడి వివరాలు.. నిందితుడిగా యడ్లపల్లి గణేష్ (19)ను పోలీసులు గుర్తించారు. ఇతను రామానుజపురం గ్రామం, కొయ్యలగూడెం మండలానికి చెందినవాడు. కులం: ఎస్సీ–మాదిగ.
నేరానికి కారణం.. మృతురాలు మరియు నిందితుడి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు, బెదిరింపులే ఈ హత్యకు కారణమని దర్యాప్తులో వెల్లడైంది. ముందస్తు పథకం ప్రకారం నిందితుడు మృతురాలిని తలపై కర్రతో మోది హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి నుంచి కీలక భౌతిక ఆధారాలను స్వాధీనం చేసుకొని కేసును మరింత బలపరిచినట్లు తెలిపారు.
ఈ హత్య కేసును అత్యంత త్వరితగతిన ఛేదించినందుకు ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్, పోలవరం డివిజన్ డీఎస్పీ, జీలుగుమిల్లి సీఐ, బుట్టాయగూడెం పోలీస్ సిబ్బందిని అభినందించారు.















Social Plugin