ఉగ్రదాడులు, మదీనా బస్సు ప్రమాదంపై తీవ్ర విచారం
సిరాతె ముస్తఖీమ్ కన్వెన్షన్‌కు సక్రమ ఏర్పాట్లు చేయాలి
ANDRAPRADESH, ఏలూరు జిల్లా, ఏలూరు, నవంబర్ 29: ఇస్లాం ధర్మంలో ఉగ్రవాదానికి ఎలాంటి స్థానం లేదని, మతపరమైన విలువలను వక్రీకరించి హింసకు పాల్పడేవారికి మతంతో సంబంధమే లేదని జమ్ యియ్యత్ అహ్లెహదీస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు షేక్ ఫజులుర్రహ్మాన్ ఖురైషి ఉమరి అన్నారు.
ఏలూరు పెన్షన్ లైన్‌లోని మదీని మస్జిద్‌లో శనివారం నిర్వహించిన జమ్ యియ్యత్ అహ్లెహదీస్ రాష్ట్ర త్రైమాసిక కమిటీ సమావేశంకు అధ్యక్షత వహించిన ఆయన, ఈ నెల 10న ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోవడంపై గాఢ సానుభూతి తెలిపారు. “ఇస్లాం ధర్మం శాంతి, సంఘీభావాన్ని ఉపదేశిస్తుంది. ఉగ్రవాదం ఇస్లాం బోధనలకు విరుద్ధం. దోషులను కఠినంగా శిక్షించాలి” అని ఉమరి హెచ్చరించారు.
అదేవిధంగా ఈ నెల 17న పవిత్ర నగరం మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రకు వెళ్లిన 18 మంది, ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దుర్భాగ్యకరమని, ఈ సంఘటన మనసును మ్రింగేసిందని ఆయన బాధ వ్యక్తం చేశారు. మరణించిన వారికి అల్లాహ్ క్షమాపణలు ప్రసాదించి, స్వర్గంలో స్థానం కలిగించాలని ప్రార్థించారు.
ఈ నెల 30న జరగబోయే "సిరాతె ముస్తఖీమ్" కన్వెన్షన్ గురించి మాట్లాడుతూ—
పాల్గొనే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, ఏర్పాట్లు చక్కగా నిర్వహించాలని సభ్యులను కోరారు. “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనలు, నైతిక విలువలు ప్రజలకు చేరవేయడం మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.
అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు అన్ని మస్జిద్‌లకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను డిసెంబర్ 5వ తేదీ లోపు ‘ఉమ్మీద్ పోర్టల్’లో తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు. దేశంలో ఐక్యత, సౌహార్దం పెంపొందాలని, “ఐకమత్యమే మహాబలం” అని ఆయన సందేశం ఇచ్చారు.















Social Plugin