ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, కలెక్టర్ వెట్రీ సెల్వి సంయుక్తంగా పరిశీలన
హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ మార్గాల వరకు క్షుణ్ణమైన తనిఖీలు
ANDRAPRADESH, ఏలూరు జిల్లా, ఏలూరు, ఏలూరు, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1న ఉంగుటూరు మండలం, గొల్లగూడెంను సందర్శించనున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రీ సెల్వి కె, ఇతర అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంలో ఎస్పీ–కలెక్టర్ బృందం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ (ASL) కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి పర్యటన మార్గాల్లో ఎస్పీ స్వయంగా పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతం, లబ్ధిదారులకు పథకాలు అందించే వేదికలు, సీఎం సందర్శించనున్న గృహాలు, కాన్వాయ్ రూట్లను పూర్తిగా తనిఖీ చేశారు.
పర్యటనలో ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా జరిగేందుకు భద్రతా ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. భద్రత విషయంలో రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
రోడ్డుకు ఇరువైపులా బాంబ్ డిస్పోజల్ టీమ్ (BDT), డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నారని, పర్యటన పూర్తయ్యే వరకు ఈ జల్లెడ కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు.
ఈ ఉన్నతస్థాయి ASL కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి ప్రసాద్, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, నిడమర్రు ఇన్స్పెక్టర్ రజనీ కుమార్, ఏఆర్ ఆర్‌ఐ సతీష్ తో పాటు పలువురు పోలీసు, శాఖల అధికారులు పాల్గొన్నారు.















Social Plugin