లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత తప్పనిసరి: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


అవకతవకలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్ష లేదు – దుగ్గిరాల సమీక్ష సమావేశంలో హెచ్చరిక
పేదల సొంతింటి కల సాకారం కోసం కూటమి ప్రభుత్వం ధృడ సంకల్పం

ANDRAPRADESH, ఏలూరు జిల్లా, దెందులూరు, నవంబర్ 29: పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా అండగా నిలుస్తుందిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి ఒత్తిడులు, ప్రలోభాలు, అవకతవకలు చోటు చేసుకోకుండా పూర్తి పారదర్శకత పాటించాలని గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

శనివారం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ కాలంలో పేదలకు రావాల్సిన ఇంటి బిల్లులు చెల్లింపు కాక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, అనర్హులను లబ్ధిదారులుగా చూపి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఘటనలు జరిగాయని అన్నారు.

“ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సొంతింటి కలను మళ్లీ సాకారం చేసేందుకు కృషి చేస్తున్నాం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకు ముందు ఉదయం వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల వినతులను ఎమ్మెల్యే ప్రభాకర్ స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చారు.

తర్వాత కూటమి నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన— “హౌసింగ్ లోన్స్ ఎంపిక ప్రక్రియ నవంబర్ 30తో ముగియనుండటంతో పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలలో అర్హులైన ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించాలి” అని సూచించారు.

ఎంపిక ప్రక్రియలో ఏదైనా అవకతవకలు జరిగినట్లు తెలిసినా, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గృహనిర్మాణ శాఖ అధికారులు, సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.