జంగారెడ్డిగూడెంలో ముగ్గుల పోటీలు – మహిళా ప్రతిభకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రశంసలు


జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్యా వికాస్ విద్యా సంస్థలు మరియు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో ప్రతిభ చూపి విజేతలుగా నిలిచిన మహిళలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేసి అభినందించారు.


ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయం, సంస్కృతి, కళలను భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా మహిళలలోని సృజనాత్మకతను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

విద్యతో పాటు సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న విద్యా సంస్థలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డ మనగు రవికుమార్, ఆకుల అరుణ, పెండ్యాల రమాదేవి, సూర్య విద్యా సంస్థల చైర్మన్ కే. రమాదేవి, విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జిల్లా యాజమాన్యం, రిపోర్టర్లు పాల్గొన్నారు.

అలాగే పోటీదారులు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.