చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటన – విద్య నాణ్యతపై ప్రత్యేక దృష్టి


ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో మెగా పిటీఎం 3.0 కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల చదువు ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో సమావేశమై, తల్లితండ్రులను పిలిపించి ప్రోగ్రెస్ రిపోర్టులను సమీక్షించారు. పాఠశాల ప్రారంభం నుంచి ఇప్పటివరకు వచ్చిన మార్కులు, గ్రేడులు ఎలా మారాయి అన్న విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు.


ఎమ్మెల్యే రోషన్ విద్యార్థులకు ఇంగ్లీష్ పుస్తకాలు ఇవ్వించి చదివించడంతో పాటు, ఉపాధ్యాయులు ఇచ్చిన రిపోర్టులపై స్పష్టత కోరారు. విద్యార్థుల ఫలితాలు మరింత మెరుగుపడేలా ఏ మార్పులు చేయాలి అన్న దానిపై ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్టులో విద్యార్థుల పట్టు పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే A1 గ్రేడ్ నుంచి A2 కి ఎందుకు తగ్గిందో కూడా ప్రశ్నించారు.


“మళ్లీ రెండు నెలల్లో వస్తాను… అప్పటికి విద్యార్థుల చదువులో స్పష్టమైన మార్పులు కనిపించాలి” అని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. తల్లితండ్రులు ప్రతిరోజూ పిల్లలతో మాట్లాడి, వారు పాఠశాలలో నేర్చుకున్న విషయాలు తెలుసుకోవాలని, ఏ సబ్జెక్టులో మార్కులు తగ్గుతున్నాయో గమనించి ఉపాధ్యాయులతో చర్చించాలన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులకు బాధ్యతతో పాటు పద్ధతి కూడా అవసరమని సూచించారు.

పాఠశాలలో విద్య నాణ్యతను మరింతగా పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు తీసుకుంటామని ఎమ్మేల్యే పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రామారావు, కిరణ్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.