ఏలూరులో 'వీర్ బాల దివస్' కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

పెదపాడు /ఏలూరు, డిసెంబర్, 26 : చిన్నతనం నుండి ప్రతీ ఒక్కరూ ధృడమైన మనస్తత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  అన్నారు. వట్లూరులోని  సిద్దార్థ క్వెస్ట్ స్కూల్ లో శుక్రవారం జరిగిన  'వీర్ బాల దివస్' కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సత్యం, ధర్మం, ధైర్యం, దేశప్రేమ వంటి నైతిక విలువలను చిన్నతనం నుండి కలిగి ఉండాలన్నారు. సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ జీ నలుగురు కుమారుల (సాహిబ్జాదేస్) సాహసం, త్యాగాలను స్మరించుకుంటూ 'వీర్ బాల దివస్' కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటున్నామన్నారు.


వారి స్ఫురితోతో ప్రతీ ఒక్కరూ  దేశ సమైక్యత, సమగ్రతలు, తాము  నమ్మిన సిద్ధాంతాలు, విశ్వాసానికి కట్టుబడి ఉండాలన్నారు. బాహ్య ప్రలోభాలకు లొంగకూడదని, చిన్నతనం నుండే అలవరచుకోవాలని, ఎటువంటి విషమ పరిస్థితులు ఎదురైనా తాము నమ్మిన సిద్ధాంతాలకు ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు. ప్రజల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఉందని, ప్రతీ విద్యార్థినీ, విద్యార్థులు చిన్నతనం నుండి ధైర్యసాహసాలు కలిగి ఉండాలని, తమ పరిసరాలలో జరిగే అన్యాయాలు, అకృత్యాలను తెలియజేయాలన్నారు.  

తమ పరిసరాలలో రాగ్గింగ్, మహిళలపై అఘాయిత్యాలు వంటివి గుర్తిస్తే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. అదేవిధంగా గృహ హింస వంటి సంఘటనలను 181 కి ఫోన్ చేసి తెలియజేస్తే, బాధితులను రక్షించవచ్చన్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో తమ తల్లిని, తమను శారీరకంగా దాడులు చేసి హింసిస్తుంటే ఆ పిల్లలు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసారని, అధికారులు అటువంటి కీచకుడినుండి ఆ పిల్లలను రక్షించారన్నారు. మనమే కాకుండా సమాజంలో అందరూ బాగుండాలనే భావనతో ఉండాలన్నారు. ప్రస్తుత రోజులలో స్వీయరక్షణకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగిఉండాలన్నారు. 

ఈ సందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన కరాటే ప్రదర్శన ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ  శ్రీహరి,డిఆర్డిఏ పీడీ విజయరాజు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ,ఐసిడి ఎస్ పీడీ శారద, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, డిఎస్పీ శ్రావణ్ కుమార్, విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏ డి రామ్ కుమార్,   సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రభృతులు పాల్గొన్నారు.