పోలవరం మండలాలు లేకుండా జిల్లా ఏర్పాటు సిగ్గుచేటు : సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి


ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి: జీలుగుమిల్లి మండలం జగదంబ సెంటర్‌లో మన్యం బంద్‌లో భాగంగా నిర్వహించిన రాస్తారోకోలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి పాల్గొని మాట్లాడారు. పోలవరం జిల్లాను ప్రకటిస్తూ, పోలవరం నియోజకవర్గానికి చెందిన ప్రధాన మండలాలను చేర్చకపోవడం సిగ్గుచేటైన చర్యగా ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పోలవరం నియోజకవర్గంలోని మండలాలను జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేశారు.


పోలవరం జిల్లా ప్రకటించినప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని మండలాలను కలుపుతూ జిల్లా ఏర్పాటు చేశారని, కానీ పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు వంటి కీలక మండలాలను వదిలేయడం అన్యాయమన్నారు. అలాగే టీ.నర్సాపురం, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లోని గిరిజన గ్రామాలను కలుపుకొని మొత్తం 29 గిరిజన మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. అలా చేస్తే నిర్వాసితులు, ఆదివాసీల సమస్యలకు పరిష్కారం లభించి ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశముంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తెల్లం దుర్గారావు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నిర్వాసితులను జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో పునరావాసం కల్పించారని గుర్తు చేశారు. అలాంటప్పుడు పోలవరం నియోజకవర్గంలోని గ్రామాలను పోలవరం జిల్లాలో చేర్చకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. ప్రభుత్వ హామీలను అమలు చేయకపోతే మరింత ఉధృత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

మన్యం బంద్ జీలుగుమిల్లి మండలమంతటా సంపూర్ణంగా విజయవంతమైంది. కామయ్యపాలెం, ధర్మగూడెం, ములగలంపల్లి కేంద్రాల్లో కూడా బంద్‌కు పూర్తి స్పందన లభించింది. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ముందుగా జగదంబ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం రాస్తారోకో చేపట్టారు.

ఈ కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సిరిబత్తుల సీతారామయ్య అధ్యక్షత వహించగా, చిట్టిబొమ్మ కొండలరావు, కారం నాగదుర్గ, నేలటూరు నిర్మల, తెల్లం శంకరుడు, గుండి గంగరాజు, ఎన్.అప్పారావు, కలపాల జగదేశ్, దాసరి రామారావు, నరసింహ, బేతి లక్ష్మీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.