ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరులోని వై.ఎం.హెచ్.ఏ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ భాషా–సాంస్కృతిక శాఖ సహకారంతో గత మూడు రోజులుగా నిర్వహించిన అభినయ నృత్యభారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు మూడవ రోజు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి కూచిపూడి, జానపద సీనియర్స్ కేటగిరీ, బృంద నృత్య పోటీలు నిర్వహించగా, చివరి రోజు మొత్తం 150 మంది చిన్నారి, యువ నర్తకులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేశారు.
జాతీయ స్థాయి శాస్త్రీయ యువ నృత్యోత్సవాలు
సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు నిర్వహించిన జాతీయ స్థాయి శాస్త్రీయ యువ నృత్యోత్సవాలను లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్.వి.వి.ఎస్. పాపారావు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో నాట్యాచార్యులు లయన్ దువ్వి హేమసుందర్ ద్వారా లయన్స్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని తెలిపారు.
ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసిన నృత్యాలు
ఈ నృత్యోత్సవాల్లో...
* విశాఖపట్నం కు చెందిన "కుమారి గాయత్రి" – కూచిపూడి
* ఒడిశా బరంపురం కు చెందిన "కుమారి తులిక రెడ్డి" – ఒడిసి
* చెన్నై కు చెందిన "డి. చక్రవర్తి" – కూచిపూడి
* కరీంనగర్ కు చెందిన "టి. సంతోష్" – పెరిణి శివతాండవం
* సామర్లకోట కు చెందిన "చక్రవర్తుల పవన్ కుమార్" – కూచిపూడి
* వరంగల్ కు చెందిన "కుమారి బి. వైష్ణవి" – పెరిణి లాస్యం
* కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ "బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత" కాకినాడకు చెందిన "బి. మల్లిఖార్జునరావు" – భరతనాట్యం
ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. వీరందరికీ సంస్థ తరఫున "నృత్య కౌముది అవార్డులు" అందజేశారు.
ప్రత్యేక సత్కారం
ప్రఖ్యాత కూచిపూడి నృత్య గురువు, యక్షగాన ఖంటీరవ "డా. పసుమర్తి శేషుబాబు" కి భరత కళాప్రపూర్ణ శ్రీ కోరాడ నరసింహారావు మెమోరియల్ – "నృత్య రంగ సేవాతపస్వి" అవార్డుతో ఘనంగా సత్కరించారు.
అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖుల పాల్గొనడం.. అవార్డులు, బహుమతుల ప్రదానోత్సవ సభకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, లయన్స్ పూర్వ గవర్నర్లు దామెర రంగారావు, వేమా కోటేశ్వరరావు, ఉత్సవాల ఆహ్వాన సంఘం కార్యదర్శులు లేళ్ల వెంకటేశ్వరరావు, దువ్వి రామారావు, సంస్థ ప్రతినిధులు డా. ముసునూరి వెంకట ప్రసాద్, యర్రా హరనాధ్, కానాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుని, నృత్య కళల ప్రాధాన్యతను మరోసారి చాటింది.

















Social Plugin