ఏలూరు జిల్లా, ఏలూరు, నవంబర్ 30 : జిల్లాకు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఏలూరు అన్నే భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, కార్యదర్శి కె. శ్రీనివాస్ ఈ లేఖను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెదవేగి ఆయిల్‌ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణను వెంటనే ఆపడంతో పాటు, అదే ప్రాంతంలో కొత్త కర్మాగారం నిర్మించాలన్నారు.** చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు నెమ్మదిగా సాగుతున్నందుకు ఆందోళన వ్యక్తం చేస్తూ, మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించేలా పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకంలో భూములు కోల్పోయే రైతులకు ప్రైవేట్ మార్కెట్ విలువ మేరకు పరిహారం చెల్లించాలని కోరారు.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పై మాట్లాడుతూ.. సర్వీస్ రోడ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రంపై ఒత్తిడి చేసి సర్వీస్ రోడ్ల వ్యవస్థ తప్పనిసరిగా కల్పించాలన్నారు. తాజా తుఫాన్ ప్రభావంతో పెరిగిన తేమశాతం నిబంధనలు సడలించి, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. **కొల్లేరు పరిధిని 5వ కాంటూరులోనే నిలుపుతూ ప్రజల జీవన హక్కులను కాపాడాలని** డిమాండ్ చేశారు.
మొక్కజొన్న విత్తన కంపెనీల మోసాలను అరికట్టి, రైతులకు సరైన అగ్రిమెంట్లు ఇవ్వించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి డెల్టాలో రబీ సాగు ఇబ్బందులు లేకుండా నీరు అందించాలని, కృష్ణా–గోదావరి డెల్టాల ఆధునీకరణకు తగిన నిధులు కేటాయించాలని తెలిపారు. మొంథా తుఫాను వల్ల జిల్లాలో భారీగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని** సంఘం కోరింది. కొబ్బరి, అరటి, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు ధరలు పడిపోవడంతో రైతులు దెబ్బతింటున్నారని, కనీస మద్దతు ధరలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని పంటలకు ఉచిత పంట బీమా పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువలను పూర్తి చేసి, ద్వారకాతిరుమల–దెందులూరు నియోజకవర్గాల మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల సాయం అందించాలన్నారు. కోకో ధరలను అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానించి గిట్టుబాటు ధరలు ప్రకటించాలని కోరారు. జిల్లా రైతాంగ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకుంటారనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు.















Social Plugin